2024 లోక్ సభ ఎన్నికలతో పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రాజకీయపరమైన పొత్తులు ఆసక్తికరమైన మలుపులు తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైయస్ జగన్ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కలుగుతుంది. ప్రస్తుతానికి ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ మరే పార్టీతో జతకలుస్తుందో అన్న ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ.. ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్న భారతీయ జనతా పార్టీతో జాతీయస్థాయిలో మంచి సంబంధాలను కలిగి ఉంది. తరచూ దేశ రాజధాని కి వెళుతున్న వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాటంకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులతో భేటీ అయి వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యంగా ఉంటున్నామని వైయస్సార్సీపి నేతలు.. జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే క్లారిఫికేషన్లు ఇచ్చుకుంటున్నారు. దీనికి ప్రత్యేక కారణాలు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే వైయస్సార్సీపి ప్రత్యర్థి పార్టీలు.. తెలుగుదేశం, జనసేన నాయకులు జగన్ ఢిల్లీ వెళ్ళేది తనపై ఉన్న కేసుల దర్యాప్తును నెమ్మదింప చేసుకోవడానికేనని ఆరోపిస్తూ ఉంటారు. వారి ఆరోపణను తిప్పికొట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు ఏపీ ప్రయోజనాల కోసమేనని చెబుతూ ఉంటారు. జగన్ ఢిల్లీ పర్యటనల అర్థం, పరమార్ధం ఎలా ఉన్నా ఆయన బిజెపి నాయకత్వంతో కలహాన్ని కోరుకోవడం లేదనేది మాత్రం వాస్తవం. ఈ కోణంలో ఆలోచిస్తే 2024 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సిపి, భారతీయ జనతా పార్టీతో వైరంతో ఉంటుందా లేక సన్నిహితంగా ఉంటుందా లేక తటస్థ వైఖరిని తీసుకుంటుందా అన్నది కీలకంగా కనిపిస్తోంది. బిజెపి ఏపీ నాయకత్వం తరచూ జగన్ ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. టిడిపి, జనసేన విమర్శలపైన, ఆరోపణలపైన స్పందించినంత ఘాటుగా బిజెపి నేతల కామెంట్లపైన వైఎస్ఆర్సిపి నాయకులు స్పందించని విషయం లోతుగా పరిశీలించిన వారికి బోధపడుతుంది. ఈ కారణంగానే లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్సీపి, భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలు ఏ రూపును సంతరించుకుంటాయో అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం.

మూడు పార్టీలు ఒక్కటయ్యేనా?

ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ, జనసేన మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఇది మాటల వరకు మాత్రమే పరిమితం అని ఇటీవల ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పరోక్షంగా నిరూపణ అయింది. వైజాగ్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బిజెపి నేత మాధవ్ తిరిగి పోటీ చేస్తే జనసేన వర్గాల నుంచి ఆయనకు సహకారం కరువైంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జనసేన వర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేసాయన్నది ఏపీ బీజేపీ నేతల ఆరోపణ. ఈ మేరకు వారు తమ పార్టీ అధినాయకత్వానికి జనసేనకు వ్యతిరేకంగా ఒక నివేదిక కూడా అందజేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్ ఆ భేటీ తర్వాత కూడా బిజెపితో తాము కలిసే ఉన్నట్లు వెల్లడించారు. ఒకపక్క బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా పవన్ కళ్యాణ్ వెళుతున్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా పలు సందర్భాలలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేలా తమ భవిష్యత్తు వ్యూహం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. అదే సందర్భంలో చాలా అంశాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరస్పరం సంఘీభావం వ్యక్తం చేసుకుంటున్నారు. వైజాగ్ పర్యటనలో పవన్ కళ్యాణ్‌ను పోలీసులు నిర్బంధం చేసిన సందర్భంలో ఆయన విజయవాడ తిరిగి రాగానే చంద్రబాబు అకస్మాత్తుగా వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, జనసేన మిత్రపక్షాలుగా మారే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు చాలానే వచ్చాయి. అయితే టిడిపితో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ బిజెపితో బంధాలను తెంచుకుంటారా అన్నది ప్రధానమైన ప్రశ్న. 2019 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు చేసిన ఘటైన విమర్శలను ఇంకా మరచిపోని బిజెపి అధినాయకత్వం.. తెలుగుదేశం పార్టీతో జతకట్టెందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. అలాంటి సందర్భంలో మూడు పార్టీలు కలవాలన్న పవన్ కళ్యాణ్ అభిమాతం నెరవేరే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ ఎన్నికల నాటికి ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడే ఊహించలేము. నిజానికి టిడిపి, జనసేన, బిజెపి కలిస్తే వైసీపీని గద్దె దింపడం సులభమే కానీ మూడు పార్టీల నేతల మధ్య ఉన్న భేషజాలు వీటి కలయికకు అడ్డంకిగా ఉన్నాయనే చెప్పాలి. గత రెండేళ్లుగా చంద్రబాబు బిజెపి అధినాయకత్వానికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేనప్పటికీ అంతర్లీనంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీలోని కొంతమంది నేతలు స్థానికంగా టిడిపితో కలిస్తే నాలుగైదు ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చని, రాష్ట్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందవచ్చని భావిస్తున్నారు. కానీ 2019 నాటి చంద్రబాబు కామెంట్లను మరచిపోని బిజెపి నేతలు ఏపీలో నష్టం జరిగినప్పటికీ జాతీయస్థాయిలో గౌరవాన్ని నిలుపుకోవడం కోసం టిడిపితో ఎంత మాత్రం కలవ వద్దని భావిస్తున్నారు. స్థానిక నాయకుల అభిమతం ఎలా ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాగా ఉన్న బిజెపి అధినాయకత్వం టిడిపితో పొత్తుపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

జగన్ దగ్గర బ్రహ్మాస్త్రం!

ఇక ఏపీలో వామపక్షాల సంగతి విచిత్రంగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు.. జనసేన పార్టీతో కలిసి పోటీ చేశాయి. ఆనాటి స్నేహం వారికి ఏమాత్రం సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. వామపక్షాలతో పొత్తు జనసేనకు కూడా కలిసి రాలేదు. ఆ తర్వాత జనసేన బిజెపికి చేరువయ్యింది. ఇప్పుడు వామపక్షాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ.. జనసేన, బిజెపిల వైపు చూస్తూ ఉండడం వామపక్షాలకు ఇబ్బందిగా ఉందనే చెప్పాలి. బిజెపి అధినాయకత్వం గనక తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ససేమిరా అంటే వెంటనే చంద్రబాబును కలిసేందుకు వామపక్షాల నేతలు కాళ్లకు చెప్పులేసుకుని మరి సిద్ధంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసిన చంద్రబాబు ఆ తర్వాత తాను తప్పు చేశానని భావిస్తున్నప్పటికీ పైకి డాంబికంగా వ్యవహరిస్తున్నారు. జనసేన, బీజేపీలతో కలిసి ఒక కూటమిగా 2024 ఎన్నికలను ఎదుర్కొంటే స్థానికంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు జాతీయస్థాయిలో మరోసారి మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందవచ్చని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా పార్టీ నాయకులకు పదవులు దక్కడమే కాకుండా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసేలా కేంద్ర సంస్థలపై ఒత్తిడి కూడా తీసుకురావచ్చు. ఇలా బహుముఖ ప్రయోజనాలు ఉన్నందువల్లే టిడిపి.. బిజెపితో కలవాలని కోరుకుంటూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద 2024 లోక్ సభ ఎన్నికలతో పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రాజకీయపరమైన పొత్తులు ఆసక్తికరమైన మలుపులు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం కూడా లేకపోలేదు. 2023 సంవత్సరం ఆఖరులో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. వైఎస్ జగన్ అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకొని అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల ముందుగా ఈ ఐదు రాష్ట్రాలతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మాస్టర్ స్ట్రోక్ కొట్టే సాహసం వైయస్ జగన్ చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *