జియోగ్రాఫికల్‌గా  చూస్తే కర్నాటక రాష్ట్రానికి ఒక స్పెషాలిటీ ఉంది. దీని కారణంగా మరే రాష్ట్రంలో లేనంతగా కర్నాటక రాజకీయాలపై ఇతర భాషలు మాట్లాడే ప్రజల ప్రభావం కనిపిస్తుంది.

మే 10వ తేదీన పోలింగ్ జరగబోతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పర్వం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. అదే సమయంలో అత్యధిక మొత్తాల్లో నగదు, వస్తువులు స్వాధీనం అవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికే దాదాపు రెండున్నర రెట్లు అధికంగా సొమ్ము అధికారులు సీజ్ చేశారు. ఏప్రిల్ 29వ తేదీ నాటికి ఎన్నికల అధికారులు సీజ్ చేసిన నగదు, వస్తువుల విలువ 302 కోట్ల రూపాయలుగా తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి పది రోజుల ముందుగా లభ్యమైన 115.9 కోట్ల రూపాయలతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో పోలింగ్‌కు పది రోజుల ముందు లభ్యమైన మొత్తం దాదాపు రెండున్నర రెట్లు ఉంటుంది. ఈ లెక్కన కర్నాటక ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుందో అంచనా వేయవచ్చు. ఈ ధన ప్రవాహానికి కారణం అక్కడ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా తలపడుతున్నాయి. ప్రజలు కూడా గత ఐదేళ్ల రాజకీయపరమైన మార్పులు చేర్పులు, వ్యూహ ప్రతి వ్యూహాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి తీర్పు చెప్పే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు యధాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఫలితమే అధికారుల దాడుల్లో లభ్యమవుతున్న భారీ డబ్బు మూటలు.

భాషేతరుల ప్రభావం ఎక్కువే

ఈ సంగతి ఇలా పక్కన పెడితే కన్నడ నాట జరుగుతున్న ఎన్నికలలో పొరుగు రాష్ట్రాల ప్రజలు నాయకుల ఇన్ఫ్లూయెన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. జియోగ్రాఫికల్‌గా  చూస్తే కర్నాటక రాష్ట్రానికి ఒక స్పెషాలిటీ ఉంది. కర్నాటక రాష్ట్రం ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది. దక్షిణాన కేరళ, ఆగ్నేయంలో తమిళనాడు, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఈశాన్యాన తెలంగాణ, ఉత్తరాన మహారాష్ట్రా, పశ్చిమాన గోవా రాష్ట్రాలతో కర్నాటక సరిహద్దులు కలిగి ఉంది. దీని కారణంగా మరే రాష్ట్రంలో లేనంతగా కర్నాటక రాజకీయాలపై ఇతర భాషలు మాట్లాడే ప్రజల ప్రభావం కనిపిస్తుంది. కన్నడేతర జనాభా అధిక సంఖ్యలో ఉండటం రాష్ట్రంలో ఆయా వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి బీజం వేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్‌లు కలిపి వంద మందికి పైగా తెలుగు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. అదే సమయంలో మరాఠా మూలాలు ఉన్నవారు 50 మందికిపైగా బరిలో ఉన్నారు. తమిళులు కూడా మరో పదిమంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కర్నాటకలో కన్నడ, ఉర్దూ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్‌కు బార్డర్ కలిగి ఉన్న బళ్లారి, చిత్రదుర్గ, తుమ్‌కూరు,  పావగడ, కోలార్, చిక్బల్లాపూర్ లాంటి ప్రాంతాలలో తెలుగు మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో భాగమైన బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూర్ జిల్లాల్లో కూడా తెలుగు మాట్లాడే వ్యక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నాలుగు జిల్లాలు తెలంగాణ సరిహద్దులో ఉన్నాయి. దాంతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ నేతలతో అక్కడ ప్రచారానికి ప్రణాళిక రచించారు.. అమలు చేస్తున్నారు. ఇక కోలార్, బెంగళూరు అర్బన్, రామనగర, చామరాజనగర జిల్లాల్లో తమిళ భాష మాట్లాడే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దక్షిణ కర్నాటకలోని మైసూరు, కొడగు, చామరాజనగర, దక్షిణ కన్నడ జిల్లాల్లో మలయాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గోవా సరిహద్దులోని ఉత్తర కర్నాటక, బెళగావి జిల్లాల్లో కొంకణి భాష మాట్లాడే వారు కనిపిస్తారు. మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి, విజయపుర, కలబురిగి, బీదర్ జిల్లాల్లో మరాఠా భాష మాట్లాడే వారు కూడా ఉన్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా కర్నాటక అసెంబ్లీకి తెలుగు సహా ఇతర భాషలు మాతృభాషగా కలిగి ఉన్నవారు ఎన్నిక అవుతున్నప్పటికీ వారు తమ మూలాలను వెల్లడించేందుకు ఇష్టకపడకపోవడం గమనార్హం. ఎందుకంటే అవి వెల్లడిస్తే తమ రాజకీయ ఎదుగుదల దెబ్బతింటున్నది వారి భావన.

మరాఠాల వైఖరేంటి?

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఏకీకరణ సమితి చేసిన రగడ ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం కనిపిస్తుంది. మహారాష్ట్రకు సరిహద్దులోని బెళగాలి జిల్లాలో మరాఠాల ప్రభావం కాస్త ఎక్కువ. బెళగావిని మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితికి ఆ ప్రాంతంలో గట్టిపట్టే ఉంది. 1957 నుంచి కర్నాటక అసెంబ్లీకి మహారాష్ట్ర యోగీకరణ సమితి వారు ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక దక్షిణాన ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి 2004 వరకు గెలిచిన ఎమ్మెల్యే లలో తమిళులే ఎక్కువ. ప్రస్తుత ఎన్నికల్లో పులకేశినగర్ నుంచి అంబరాసన్ ఏడీఎంకే తరఫున పోటీకి దిగారు. కానీ బిజెపి నాయకుల విజ్ఞప్తి మేరకు ఆయన వైదొలిగారు. మరికొన్ని ప్రాంతాలలో తెలుగు, మరాఠీ, తమిళ మూలాలున్న నేతలు వివిధ పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. కానీ వారు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా స్థానిక అంశాల ప్రస్తావనతోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మైసూరు తొలి సీఎం తెలుగోడే

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1947లో ఉన్న మైసూరు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి తెలుగు వాడే కావడం విశేషం. 1947లో మైసూరు రాష్ట్రానికి తెలుగువాడైన క్యాసంబల్లి చంగల్రాయ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నాటక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కన్నడ రాజకీయాలలో తెలుగువారు చురుకుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా శ్రీనివాస్ పూర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కె.ఆర్. రమేష్ కుమార్, కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా రెండు దఫాలుగా పని చేశారు. 1994 నుంచి 99 వరకు, తిరిగి 2018 నుంచి 2019 వరకు రమేష్ కుమార్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఇక కర్నాటక రాజకీయాలలో పెను సంచలనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల వ్యవహారంలో వివాదాస్పద బిజినెస్‌మన్ అయిన గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుటుంబీకులు శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఆయన స్నేహితుడు శ్రీరాములు, కట్ట సుబ్రహ్మణ్యం నాయుడు కర్నాటక మంత్రులుగా వ్యవహరించారు. గాలి జనార్దన్ రెడ్డి మరొక సోదరుడైన సోమశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరే కాకుండా జయనగర బీటీఎం లేఅవుట్ నుంచి ఏడుసార్లు నెగ్గిన డి.రామలింగారెడ్డి గత ఎన్నికల్లో గెలిచిన సౌమ్యా రెడ్డి మరోసారి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  2018 శాసనసభ ఎన్నికల్లో తెలుగువారు ఏకంగా 20 మంది కన్నడ అసెంబ్లీకి ఎన్నికవ్వడం విశేషం. దాంతో ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగు, తమిళ, మలయాళ, మరాఠా, కొంకణి ప్రజల ప్రభావం ఖచ్చితంగా పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed