రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు జరగబోతోంది. మహానాడు నిర్వహించే స్థలాన్ని టీడీపీ నేతల బృందం పరిశీలించింది. ఈ సారి జరిగే పసుపు పండగ మరోసారి చరిత్రలో నిలుస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

వచ్చే నెలలో జరిగే పసుపు పండుగ రంగం సిద్ధమవుతోంది. మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుంది. జాతీయ రహదారికి అనుకుని రాజమండ్రి- రూరల్ వేమగిరిలో మహానాడు నిర్వహణకు స్థలాన్ని ఎంపిక చేశారు టీడీపీ నేతలు. మహానాడు వేదిక స్థలాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెయ్యనాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చియ్యచౌదరితోపాటు జిల్లాకు చెందిన తెలుగుదేశం ముఖ్యనేతలు పరిశీలించారు.

ఈ సందర్భంగా.. మహానాడు కోసం 15 కమిటీలు వేశామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెయ్యనాయుడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈసారి మహానాడు మే 27, 28 తేదీల్లో రెండు రోజులు మాత్రమే ఉంటుందన్నారు. 27న ప్రతినిధుల సభ హైవేకి ఒకవైపు.. 28న భారీ బహిరంగ సభ.. హైవేకి మరోవైపు.. మొత్తంగా రెండు స్థలాల్లో పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు.

ఇక.. ఊహకందని విధంగా నభూతో.. న భవిష్యత్తు అన్న తీరులో రాజమండ్రి మహానాడు ఉండబోతుందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఏపీలోని సమస్యల పరిష్కారం దిశగా టీడీపీ మహానాడు ఉండబోతుందని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. 1994లో అధికారంలోకి వచ్చే ముందు రాజమండ్రిలోనే సభ పెట్టామని గుర్తు చేశారాయన. మళ్ళీ ఏపీని అభివృద్ధిలో నడిపించే విషయాలు మహానాడులో చర్చకు రానున్నాయని చెప్పారు. ఎన్నికలకు ముందు జరిగే మహానాడును పెద్ద ఎత్తున జరపబోతున్నామన్నారు. రాజమండ్రి మహానాడుతో 175కి175 గెలిచే దిశగా ముందుకు వెళ్ళబోతున్నామని యనమల ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిమరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *