తాజా ఎన్నికలలో బెంగుళూరు మహానగర ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తి రేపుతుంది. బెంగుళూరు మహానగరం ఎంత అభివృద్ధి చెందినా సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి.

ఏ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా రాష్ట్రమంతా ఒక ఎత్తు రాష్ట్ర రాజధానిలో ఫలితం ఒక ఎత్తు అని భావిస్తారు. ఇది కాస్మోపాలిటన్ నగరాలు రాజధానిగా ఉన్న రాష్ట్రాలలో అయితే మరి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రలో ముంబై, తమిళనాడులో చెన్నై, బెంగాల్‌లో కోల్‌కతా, తెలంగాణలో హైదరాబాద్. ఇదే కోవలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో బెంగుళూరు. ఇలా రాజధాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వెల్లడయ్యే ఫలితం కీలకంగా ఉంటుంది. రాష్ట్రాన్ని గెలవాలంటే ముందుగా రాజధానిని గెలవాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి. దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తాయి. కాస్మోపాలిటన్ నగరాలలో ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం వచ్చే స్థిరపడిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. హైదరాబాద్ మహా నగరాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీ, పంజాబీ, గుజరాతీ తదితర భాషలు మాట్లాడే ప్రజలు కూడా లక్షల సంఖ్యలో హైదరాబాదులో స్థిరపడ్డారు. సరిగ్గా ఇదే పరిస్థితి బెంగళూరు మహానగరానిది. ఐటి రంగం విపరీతంగా అభివృద్ధి చెందిన బెంగళూరులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వీరందరి మన్ననలు పొందడం అక్కడ హోరాహోరీ తలపడుతున్న బిజెపి, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు అత్యంత కీలకంగా మారింది.

బెంగళూరులో గెలుపే కీలకం

కర్ణాటకలో అధికార పీఠానికి దగ్గరి దారులు బెంగుళూరు మహానగరం లోనే ఉన్నాయి. ఆ విషయం ప్రధాన పార్టీలకు బాగా తెలుసు. దాంతో ఈ సిలికాన్ సిటీలో పట్టు సాధించేందుకు బిజెపి, కాంగ్రెస్ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. గడచిన పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బెంగుళూరు మహానగరంలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని ఈజీగా బోధపడుతుంది. బెంగళూరు మహానగరం పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా పది శాతం కంటే ఎక్కువ సీట్లు రాజధాని బెంగుళూరు లోనే ఉండడం విశేషం. 12 శాతం అంటే బెంగళూరులో వున్న 28 అసెంబ్లీ స్థానాలలో అత్యధిక సీట్లు నెగ్గాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే బెంగుళూరు సిటీలో ప్రతిసారి ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతూ వస్తుంది. ఇది ప్రధాన పార్టీలకు కొద్దిగా ఆందోళన కలిగించే అంశమే. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడానికి కారణం ఈజీగానే బోధపడుతుంది. బెంగుళూరు మహానగరంలో రాష్ట్రేతరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పెద్దగా పట్టదు. దాంతో సహజంగానే వీరు రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వీరు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం. 2013 ఎన్నికల్లో బెంగుళూరు మహానగరం పరిధిలో 55.08% ఓటింగ్ నమోదయింది. ఐదేళ్ల తర్వాత 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం 48.03% పడిపోయింది. ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో ఓటింగ్ శాతం పెంచే విషయంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ చర్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో ఇప్పుడే చెప్పలేము.

ప్రస్తుతం బీజేపీదే పట్టు

గత మూడు అసెంబ్లీ ఎన్నికల తీరుతన్నులను పరిశీలిస్తే 2008 లో బెంగళూరు మహానగరం పరిధిలోని 28 అసెంబ్లీ సీట్లలో బిజెపి 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలుచుకున్నాయి. జేడీఎస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆనాటి ఎన్నికల్లో బిజెపి తొలిసారి దక్షిణభారతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించింది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13, బీజేపీ 12, జేడిఎస్ మూడు సీట్లలో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బెంగుళూరు మహానగరంలో కాంగ్రెస్ పార్టీదే పట్టు కొనసాగింది. కాంగ్రెస్ 15 సీట్లలో గెలుపొందగా బిజెపి 11, జేడిఎస్ రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆనాటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ ప్రభుత్వం కేవలం 14 నెలలకే పడిపోయింది. 2019లో కాంగ్రెస్, జెడిఎస్ సభ్యులు పెద్ద సంఖ్యలో బిజెపిలోకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 15 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే బిజెపి ఏకంగా 12 సీట్లలో విజయం సాధించింది. అసెంబ్లీలో బలం పెంచుకుంది. దాంతో బెంగుళూరు మహానగరం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే బిజెపి శాసనసభ్యుల సంఖ్య 15 కు పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 11 కు పడిపోయింది. ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాటు బిజెపి ప్రభుత్వం స్థిరంగా కొనసాగింది.

తటస్థ ఓటర్లపై గురి

తాజా ఎన్నికలలో బెంగుళూరు మహానగర ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తి రేపుతుంది. బెంగుళూరు మహానగరం ఎంత అభివృద్ధి చెందినా సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య బెంగుళూరు నగర వాసులను వేధిస్తోంది. మౌలిక వసతుల లేమి వంటి సమస్యలు కూడా ఈ కాస్మోపాలిటన్ సిటీలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చిన మహానగర సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది బెంగుళూరు వాసుల ప్రధానమైన ఆరోపణ. బెంగళూరు మహానగరంలో 15 నుంచి 25 శాతం వరకు ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ఇలా తటస్థంగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాయి. బిజెపి అవినీతి పాలన వైఫల్యాలు కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగరవాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. శాంతి నగర, సర్వజ్ఞనగర వంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎండగడుతూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మోదీ కాంగ్రెస్ నేతల రక్తంలోనే 85 శాతం కమిషన్ వుందనడం రాజకీయంగా కలకలం రేపింది. మరోవైపు తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కమలనాథులు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో బెంగుళూరు మహా నగరంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి బలంగా కనిపిస్తోంది. అయితే ఓటరు అంతరంగం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. మే పదవ తేదీన జరగనున్న పోలింగ్‌లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అన్నది వెల్లడవుతుంది. అయితే ఓటరు తీర్పు బయటపడేది మాత్రం మే 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు తర్వాతే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *