Ugram Movie Review

మూవీ రివ్యూ: ఉగ్రం

నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు

సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

దర్శకుడు: విజయ్ కనకమేడల

నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది

మెల్లమెల్లగా తన పేరు ముందున్న అల్లరిని తీసేయాలని చూస్తున్నాడు నరేష్. అందుకే కొన్నేళ్లుగా సీరియస్ డ్రామాలు చేస్తున్నాడు. నాందితో దీనికి శ్రీకారం చుట్టిన ఈయన.. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం అంటూ వచ్చాడు. ఇప్పుడేమో ఉగ్రం అంటూ వచ్చేసాడు. మరి నిజంగానే ఆయన ఉగ్రరూపం చూపించాడా..? సినిమా ఎలా ఉంది..?

కథ:

CI శివ కుమార్ (అల్లరి నరేశ్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కుటుంబ కంటే సమాజానికే ఎక్కువ విలువ ఇస్తుంటాడు. డ్యూటీ కోసం ప్రాణం కూడా లెక్క చేయడు. భార్య (మిర్నా), కూతురుతో హాయిగా జీవితం గడుపుతుంటాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఉన్నఫలంగా తన భార్యా కూతురు మిస్ అవుతారు. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. డ్యూటీ చేద్దామంటే ఓ హెల్త్ ఇష్యూతో బాధ పడుతుంటాడు శివ కుమార్. మరి ఈ మిస్సింగ్ కేసుల వెనుక ఎవరున్నారు ? భార్య కూతురు కోసం శివ ఎలాంటి పోరాటం చేసాడు..? అందులో గెలిచాడా లేదా..? ఇంతమంది మిస్సింగ్ కేసులు ఎలా నమోదయ్యాయి అనేది మిగిలిన కథ..

కథనం:

మార్పు మంచికే అంటారు కదా పెద్దలు.. అల్లరి నరేష్‌ను చూస్తుంటే అదే అనిపిస్తుందిప్పుడు. రొట్ట కామెడీ కంటే.. సీరియస్ కథలు చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉగ్రం కూడా మంచి ప్రయత్నమే. నాందీ రేంజ్ దీనికి లేకపోవచ్చు కానీ కచ్చితంగా ఇది కూడా నరేష్‌లోని మరో కోణం బయటికి తీసింది. నిజంగా ఇంత సీరియస్ డ్రామాను అల్లరి నరేష్ హ్యాండిల్ చేయగలడా అనిపిస్తుంది.. హ్యూమన్ ట్రాఫికింగ్‌తో మెడికల్ మాఫియాను ముడిపెట్టి ఆసక్తికరమైన కథతోనే వచ్చాడు దర్శకుడు విజయ్ కనకమేడల. నాందీ మాదిరే.. ఇందులోనూ చాలా సీరియస్ పాయింట్ తీసుకున్నాడు దర్శకుడు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండుంటే ఉగ్రం మరింత పదునెక్కేది. రెండు గంటలే అయినా.. అక్కడక్కడా ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్ కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. సెకండాఫ్ నో కంప్లైంట్స్.. కథ వేగంగానే ముందుకెళ్లింది. ఒకరి తర్వాత ఒకరు మిస్సింగ్.. అందులోనే హీరోకు హెల్త్ ఇష్యూ.. దాన్ని దాటుకుని చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ ఆ అన్వేషణలో అర్రే భలే ఉందే అనిపించే సీన్స్ కరువయ్యాయి. క్లైమాక్స్ అయితే నరేష్ ఉగ్రరూపమే చూపించారు. కథలో ఆ రేంజ్ ఎమోషన్ కూడా వర్కవుట్ చేసాడు విజయ్ కనకమేడల. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాల సీన్ ఆకట్టుకుంటుంది. మధ్యలో వచ్చే పాటలు సినిమా స్పీడ్‌కు అడ్డు పడ్డాయి.

నటీనటులు:

నరేష్‌ను ఈ సినిమా తర్వాత ఉగ్రం నరేష్ అనేంతగా అందులో జీవించేసాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రకు ప్రాణం పోసాడు. క్లైమాక్స్ అయితే ఉగ్రరూపం చూపించాడు. హీరోయిన్ మిర్నా చిన్న పాత్రకే పరిమితమైంది. కూతురుగా చేసిన పాప చాలా బాగుంది.. డైలాగ్స్ ముద్దొచ్చాయి. శత్రు మంచి పాత్ర చేసాడు. నరేష్ తర్వాత ఎక్కువ మార్కులు పడేది ఆయనకే. ఇంద్రజ చిన్న పాత్రైనా బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

శ్రీ చరణ్ పాకాలా సంగీతం పర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ముఖ్యంగా నైట్ సీన్స్ చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. రెండు గంటల నిడివే అయినా కూడా అక్కడక్కడా బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయి. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సారి కాస్త తగ్గాడు.. కానీ ఫెయిల్ అయితే అవ్వలేదు. కథ బాగుంది.. కథనం మరింత ఆసక్తికరంగా ఉండాల్సింది.

పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఉగ్రం.. నరేష్ ఉగ్రరూపం..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *